భీమ కొరేగావ్ హింసాకాండ: విరసం నేత వరవరరావు అరెస్టు
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్‌కు నిధులు ఆయనే సమకూర్చినట్లు అనుమానిస్తున్నారు. గతంలో వరవరరావుపై పుణె పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు ఆయన కుమార్తె, స్నేహితుల నివాసాల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పుణె పోలీసులు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు.
సోదాల అనంతరం వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వరవరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు విచారణను వీడియో రూపంలో రికార్డు చేశారు. వైద్యపరీక్షల తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచి.. అనంతరం పుణెకు తీసుకెళ్తారని సమాచారం. మరోవైపు వరవరరావు అరెస్ట్‌ను నిరసిస్తూ.. మానవహక్కుల సంఘాల నేతలు ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిన వరవరరావుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని.. ఈ దాడిని ఖండిస్తున్నట్లు మహిళా సంఘాల నేతలు పేర్కొన్నాయి.
వరవరరావు ఇంటితో పాటు ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోనే కాక దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, గోవా, హర్యానా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు.