Rs 1.6 Crore Salary Job: పదేళ్ల పాటు ఉద్యోగం చేసినా పది లక్షల ప్యాకేజీ రాని పరిస్థితి కొందరిదైతే.. చదువుకుంటున్న చదువు కూడా పూర్తికాక ముందే ఏకంగా 1 కోటి 60 లక్షల శాలరీ ప్యాకేజీతో బంపర్ ఆఫర్‌కే బంపర్ ఆఫర్ లాంటి జాబ్ ఆఫర్ కొట్టేసి ఔరా అని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది ఈ అమ్మాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ యువతి పేరు అదితి తివారి. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కి చెందిన అదితి తివారి ప్రస్తుతం బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఎప్పుడైనా, ఎవరికైనా పెద్ద పెద్ద ప్యాకేజీతో జాబ్ ఆఫర్ వచ్చినట్టుగా వార్తల్లోకొస్తే.. అలా వార్తలొచ్చిన ప్రతీసారీ ఆ జాబ్ ఆఫర్ అందుకున్న వాళ్లు ఏదైనా ఐఐటిలోనో లేక ఐఐఎం విద్యా సంస్థల్లోనో చదువుకున్న వారే అయ్యుంటున్నారు. కానీ తొలిసారిగా ఎన్ఐటి కూడా ఈ జాబితాలో చేరింది. అవును..  పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ( ECE ) విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అదితి తివారికి అలాంటి అవకాశం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే.. అదితి తివారి అందుకున్న ఈ పారితోషికం.. ఐఐటి, ఐఐఎం విద్యా సంస్థల విద్యార్థులు అందుకున్న శాలరీ ప్యాకేజీల కంటే కూడా ఎక్కువే కావడం మరో విశేషం. 


ఇంతకీ సస్పెన్స్ పెట్టకుండా అదితి తివారికి ఈ బంపర్ ఆఫర్ జాబ్ ఇచ్చిన కంపెనీ ఏంటి ? ఆమె డెసిగ్నేషన్ ఏంటనే డౌట్ చాలామందికి రావొచ్చు. అక్కడికే వస్తున్నాం.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ తమ ఫ్రంట్ - ఎండ్ ఇంజనీర్ గా అదితి తివారిని అపాయింట్ చేసుకుంటున్నట్టుగా జాబ్ ఆఫర్ అందించింది. అందుకోసం అదితి తివారికి ఏడాదికిగాను 1 కోటి 60 లక్షల రూపాయల పారితోషికం అందించనున్నట్టు ఆఫర్ లెటర్‌లో ఫేస్‌బుక్ స్పష్టంచేసింది.


అదితి తివారి కంటే ముందుగా ఇదే పాట్నా ఎన్ఐటి విద్యా సంస్థలో సంప్రీతి యాదవ్ అనే యువతికి గూగుల్ జాబ్ ఆఫర్ ఇచ్చింది. అందుకుగాను సంప్రీతి యాదవ్‌కి గూగుల్ రూ. 1.11 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేయగా.. ఆ తరువాత అంతకంటే పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్న స్టూడెంట్ అదితి తివారినే. గతంలో అభిజీత్ ద్వివేది అనే ఐఐటి లక్నో విద్యార్థికి అమేజాన్ కంపెనీలో రూ. 1.2 కోట్ల పారితోషికంతో జాబ్ ఆఫర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అభిజీత్‌కి ఐర్లాండ్‌లోని డుబ్లిన్‌లో అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా జాబ్ ఆఫర్ అందుకున్నాడు.