జమ్మూకాశ్మీర్ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇస్తూ.. డిప్యూటీ తహసిల్దార్ పరీక్షల్లో పోటీపడేందుకు హాల్ టికెట్‌ను జారీచేసింది. అంతేకాదు దానిపై ఫోటోను కూడా ముద్రించి నవ్వులపాలైంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థి పేరు ‘కచౌర్‌ ఖర్‌’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్‌ టికెట్‌పై గాడిద ఫోటోని ముద్రించింది ఎస్‌ఎస్‌బీ. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఎస్‌ఎస్‌బీ నిర్వాకంపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్‌ఎస్‌బీ చేరిందంటూ ఓ నెటిజన్‌ ఘాటైన ట్వీట్‌ చేశాడు. ఎస్‌ఎస్‌బీ చర్య నవ్వు తెప్పిస్తోందని ఒకరంటే.. గాడిదకి హాల్‌ టికెట్‌ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్‌ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తి పోస్టు చేశాడు.


కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్‌ఎస్‌బీ అధికారులు నిరాకరించారు. గతంలోనూ సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే జరిగింది. 2015లో 'డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ టెస్టు' కోసం జమ్మూకాశ్మీర్ బోర్డు ఆవు పేరిట హాల్‌ టికెట్‌ జారీ చేయగా..  దానిపై విమర్శలు రావడంతో సర్వర్‌ నుంచి ఆవు పేరుతో ఉన్న అప్లికేషన్లను తొలగించింది.