తమిళనాడులో అధికార ఏఐఏడిఎంకే ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఏఐఏడిఎంకే కోఆర్డినేటార్ ఒ పన్నీర్ సెల్వం, కో-కోఆర్డినేటార్ ఇకే పళనిస్వామి తాజాగా కన్యాకుమారి జిల్లాపై పడ్డారు. మాజీ మంత్రి పచ్చైమాల్‌ సహా కన్యాకుమారి జిల్లాకు చెందిన 90 మంది అన్నాడీఎంకే నిర్వాహకులపై వేటు వేశారు. దీని గురించి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.


అన్నాడీఎంకే పార్టీ విధివిధానాలకు,ఆదర్శాలకు,లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వారితో కలిసి నడవకూడదని చెప్పారు.చెన్నై ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో పరాజయం చవిచూశాక అనేక జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులను పార్టీ నుంచి తొలగిస్తున్నారు పళని స్వామి, పన్నీర్ సెల్వం. దినకరన్‌ వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న నెపంతో ఇప్పటికే పలు జిల్లాల్లో నాయకులను అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించింది.