పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చురలంటించారు. తాను భారత ముస్లిం అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. భారత ముస్లింల గురించి ఆలోచించడం కన్నా పాకిస్థాన్‌ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం ఉత్తమమని హితవు పలికారు. పాక్‌ జాతి పిత మహ్మద్‌ అలీ జిన్నా రెండు మతాలు, రెండు దేశాల సిద్ధాంతాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడారు. తాము భారత ముస్లింలం అయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌, తొలి ప్రధాని నెహ‍్రూ, మహాత్మాగాంధీ, బాబూ రాజేంద్రపసాద్‌లకు రాని మత ఆధారిత పౌరసత్వ సవరణ చట్టాల ఆలోచన ప్రధాని నరేంద్ర మోదీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 


సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతికేకంగా చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, సీఏఏను వ్యతిరేకించిన యూపీ ముస్లింల దుస్థితి ఇదంటూ బంగ్లాదేశ్‌లో ఏడేళ్ల కిందట జరిగిన కొన్ని ఘటనల వీడియోలను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అసదుద్దీన్‌.. ప్రధానిగా పాక్‌ ప్రజల బాగోగులు చూసుకుంటే మంచిదని ఇమ్రాన్‌ ఖాన్‌కు హితవు పలికారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..