హైదరాబాద్: విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్స్‌లోకి ప్రవేశించడానికి ముందుగా టికెట్స్, ఏవైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించడం ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో ఒకటి. కానీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రవేశానికి మార్చి నెల నుంచి అవేవీ అవసరం లేదు. అవును, మీరు చదివింది నిజమే.. టికెట్స్, ఐడీ కార్డులతో పనిలేకుండానే ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ (ముఖాన్ని స్కాన్ చేసే పద్ధతి) విధానం ద్వారా ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ అయిపోవచ్చు. హైదరాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహిస్తోన్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన మొదటి దశ ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి దశ ప్రయోగంలో భాగంగా జీహెచ్ఐఏఎల్ తమ సిబ్బందిని ఐడీ కార్డులతో సంబంధం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ద్వారా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తవడంతో ఈ నెలాఖరులో రెండో దశ కింద ప్రయాణికులను ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ద్వారా అనుమతించనున్నారు. ఈ ప్రయోగం సైతం పూర్తయిన అనంతరం మార్చి నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


తొలి దశలో ఎయిర్ పోర్టులో వుండే కెమెరాలు ప్రయాణికుల ముఖాలను రికార్డ్ చేసి ఎయిర్ పోర్ట్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఆయా ప్రయాణికులు మొదటిసారి ఉపయోగించిన ఐడీ కార్డుల ఆధారంగా ఆయా ఫోటోలను సంబంధిత వ్యక్తులతో అనుసంధానం అయ్యేలా చేయడం ఈ ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ పరిజ్ఞానం ప్రత్యేకత. ఆ తర్వాత ప్రయాణికులు ఎయిర్ పోర్టులోకి ప్రవేశించే ప్రతీసారి అక్కడున్న ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ యంత్రాలు వారి ముఖాలను స్కాన్ చేసుకుంటాయి. తద్వారా అక్కడి సెక్యురిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతిస్తారు.