దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, నగరాల పేర్లు మార్చాలని డిమాండ్..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల పేర్లు మార్చాలని డిమాండ్..!
మొఘల్ సారాయ్ రైల్వే స్టేషన్‌కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనే పేరును పెట్టిన తర్వాత ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గంగా-యమునా నదుల సంగమ ప్రదేశం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు.
అటు అలహాబాద్ పేరును మారిస్తే తమ ఊరి పేర్లను కూడా మార్చాలని అక్కడి స్థానికులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. సంస్కృతి, చరిత్ర ఆధారంగా ఊర్ల పేర్లు ఉండాలని చెబుతున్నారు.
అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చాలని ఈ ఏడాది జూలైలో బిజెపి నేత సుబ్రమణియన్ స్వామి పేర్కొన్నారు. హిందూ రాజు కరణ్ దేవ్ పేరు ఆధారంగా అహ్మదాబాద్‌కు కర్ణావతి పేరు పెట్టాలని.. 11వ శతాబ్దంలో కరణ్ దేవ్ ఈ నగరాన్ని స్థాపించారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి శంభాజీ నగర్ అని, హైదరాబాద్‌ను భాగ్యలక్ష్మీ దేవత ఆధారంగా భాగ్య నగర్(రం) అనే పేరుపెట్టాలని కొంతమంది కోరుతున్నారు.
షాంబాజీ ఛత్రపతి శివాజీ యొక్క పెద్ద కుమారుడు. మొఘలులు బంధించి అతడ్ని హత్య చేశారు. ఔరంగాబాద్ పేరును మార్చాలని శివసేన దీర్ఘకాలం డిమాండ్ చేయగా.. 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం(బీజేపీ-శివసేన ప్రభుత్వం) దాని అధికారిక ప్రక్రియను పూర్తిచేసింది. కానీ ఆ తర్వాత దానిపై చర్చ జరగలేదు. 1996లో అదే ప్రభుత్వం సమయంలో బాంబే (బొంబాయి)ను స్థానిక ముంబ దేవి ఆధారంగా ముంబాయిగా మార్చారు.
భోపాల్ నుండి భోజ్పాల్‌గా మార్చాలని డిమాండ్
2011లో, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని భోపాల్‌ను భోజ్పాల్‌గా మార్చాలని కేంద్రాన్ని కోరగా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం అంగీకరించలేదు.
బెంగళూరుగా మారిన బెంగళూర్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో బెంగళూర్ పేరును బెంగళూరుగా మార్చింది. దీనితో పాటు కర్నాటకలోని 11 నగరాల పేర్లు కూడా (బెంగళూర్-బెంగళూరు, మైసూర్-మైసూరు, మంగళూర్-మంగళూరు, బెల్గాం-బెలగావి, హుబ్లి-హుబ్బళ్లి, గుల్బర్గా-కలబుర్గి, బీజాపూర్-విజయపుర, చిక్మగళూర్-చిక్కమగళూరు, హోస్పేట్-హోస్పేట, షిమోగా-శివమొగ్గ, టుంకూర్-టుమకూరు, బెళ్లారి-బళ్లారి) మార్చబడ్డాయి.
ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్ పేరును మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాంగా మార్చింది.
రాష్ట్ర పేర్లు మారతాయి
ఇందుకు తాజాగా ఉదాహరణలు ఒడిశా, పుదుచ్చేరి. 2011లో ఒరిస్సా పేరును ఒడిశాగా, పాండిచ్చేరి పేరును పుదుచ్చేరి మారుస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే తరహాలో కేరళ రాష్ట్రం పేరును కూడా కేరళంగా మార్చాలని డిమాండ్ పెరుగుతోంది.