అమిత్ షా మంతనాలతో శివసేన దారికొచ్చేనా ?
ఎన్నికల కోసం మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైన బీజేపీ.. తన పాత మిత్రులను దరిచేర్చుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. అ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తో భేటీ నిర్వహించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అమిత్ షా స్వయంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివాసానికి బుధవారం వెళ్తారని తెలిసింది. బీజేపీ- శివసేన సంబంధాలు భవిష్యత్తులో ఏ మేరకు ఉంటాయనేది ఈ భేటీ ద్వార తేలనుంది. దీంతో ఈ భేటీకి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవలి పరిణామాలతో బీజేపీ, శివసేన సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ను అమిత్ షా ఏ మేరకు బుజ్జగిస్తారనేది హాట్ తాపిక్ గా మారింది. వాస్తవానికి ఉద్ధవ్ థాకరే బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా లేరని టాక్. అయితే కలియుగ రాజకీయ చాణిక్యుడిగా పేరు పడ్డ అమిత్ షా ఆయన్ను ఏ విధంగా దారికి తెస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లేదని అలిగిన శివసేన .. బీజేపీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. మోడీ కేబినెట్ ఏర్పాటు నుంచి మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూసి ..ఇక లాభం లేదని భావించిన శివసేన పార్టీ కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగింది. ఈ స్థాయిలో సంబంధాలు తెగిన నేపథ్యంలో అమిత్ షా ఈ భేటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారనే దానిపై సర్వత్కా ఉత్కంఠ నెలకొంది