న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరవీరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటివరకు ఈ దాడిలో అమరులైన జవాన్ల సంఖ్య 49 మందికి చేరగా ప్రస్తుతానికి తాను 50 మంది అమర జవాన్లను దృష్టిలో పెట్టుకుని వారి అందరి కుటుంబాలకు మొత్తం రూ.2.5 కోట్లు విరాళం అందచేయనున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. అమితాబ్ చేసిన ట్వీట్ ప్రకారం ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందనుంది. 


అంతకన్నా ముందే అమితాబ్ బచ్చన్ మీడియా ప్రతినిథి మీడియాతో మాట్లాడుతూ.. బచ్చన్ గారు ప్రతీ అమరవీరుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు అని తెలిపారు. ఆ మొత్తాన్ని ఏ విధంగా ఎప్పుడు అందచేయాలనే విషయమై అమితాబ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన మీడియా ప్రతినిథి మీడియాకు వెల్లడించారు.