ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేరళ రాష్ట్రానికి సహాయం అందించడం తమ బాధ్యత అని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పలు సహాయక బృందాలు ఇప్పటికే ఏపీ నుండి కేరళకు బయలుదేరాయి. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఈ బృందాలు కేరళ చేరుకొని.. అక్కడ నిర్వాసితులకు ఆహారం, మందులు, నిత్యవసర వస్తువులు అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు, బోటు మెకానిక్స్, రక్షణ అధికారులు ఏపీ నుండి కేరళకు బయలుదేరి వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు ఈ బృందాలను పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ బృందాలను పంపించడానికి ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. తమ నుండి ఎలాంటి సహాయం కావాల్సినా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ సర్కారు తరఫున చంద్రబాబు తెలిపారు. 


భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి, ఆపన్నహస్తుల కోసం వేచిచూస్తున్న కేరళ వరద బాధితుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రూ.500 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం నుంచి అందిస్తామన్న రూ.100 కోట్ల ఆర్థిక సహాయానికి అదనంగా కేంద్రం ఈ సహాయాన్ని అందించనున్నట్టు మోదీ తెలిపారు.


అంతకన్నా ముందుగా కేరళ రాష్ట్ర గవర్నర్ పి సదాశివం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌లతో కలిసి కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాల‌కు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ప్రధాని స్పష్టంచేశారు.మే 29 నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 357కి చేరిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 70,000 కుటుంబాలకు చెందిన 3.53 లక్షల మంది నిరాశ్రయులు కాగా వారిని సురక్షితంగా 2,000 తాత్కాలిక శిబిరాలకు చేర్చినట్టు విజయన్ చెప్పారు.