ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి గతంలో ఇచ్చిన దర్యాప్తు అనుమతిని ఉపసంహరించుకోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. ఎవరైతే ఎక్కువ తప్పులు చేశారో.. వాళ్లే సీబీఐని చూసి భయపడుతున్నారని, అందుకు సీబీఐని వారి రాష్ట్రంలోకి రాకుండా అనుమతులు ఉపసంహరించుకున్నారని అరుణ్ జైట్లీ చురకలు అంటించారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికి సార్వభౌమాధికారాలు ఉండవని, అయితే, దోచుకుని దాచుకున్న మొత్తం ఎక్కువ ఉన్నప్పుడే ఆయా రాష్ట్రాల నేతలు సీబీఐ దర్యాప్తు జరపకుండా ఉండేందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో ఒక ప్రత్యేక కేసు కారణం అని కాదు కానీ, రాష్ట్రంలో ఎప్పుడు, ఏం జరుగుతుందో అనే భయమే అని అరుణ్ జైట్లీ పేర్కొన్నట్టు తెలుస్తోంది.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్.. సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని, అందుకే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.