Arun Jaitley`s family | అరుణ్ జైట్లీ కుటుంబ నేపథ్యం.. ఎవరెవరు ఏం చేస్తారు ?
అరుణ్ జైట్లీ కుటుంబ నేపథ్యం.. ఎవరెవరు ఏం చేస్తారు ?
అనారోగ్యం కారణంగా నేడు మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి(66) భార్య సంగీత జైట్లీ, కూతురు సొనాలి జైట్లీ, కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ.. జమ్మూకాశ్మీర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి కూతురు సంగీతను వివాహం చేసుకున్నారు. అరుణ్ జైట్లీ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న వాళ్లు ఎవరైనా.. ఆయన ప్రతీ విజయం వెనుక ఆమె సహకారం ఎంతగానో ఉందంటుంటారు.
అరుణ్ జైట్లీ కుటుంబ నేపథ్యం విషయానికొస్తే, తండ్రి మహరాజ్ కిషన్ జైట్లీ వృత్తిరీత్యా న్యాయవాది. తల్లి రతన్ ప్రభ గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సామాజిక కార్యకర్తగానూ పనిచేశారు. తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది కావడంతో వీరి కుటుంబం ఢిల్లీలోనే స్థిరపడింది. అరుణ్ జైట్లీకి మధు భార్గవ అనే అక్క కూడా ఉన్నారు.
అరుణ్ జైట్లీ కూతురు సొనాలి జైట్లి:
అరుణ్ జైట్లీ కూతురు సొనాలి జైట్లి కూడా తండ్రిలాగే వృత్తిరీత్యా న్యాయవాది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ దేశం విడిచిపారిపోయేందుకు సొనాలి జైట్లీ సహకరించారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. వ్యాపారవేత్త, మరో న్యాయవాది అయిన జైష్ బక్షిని ఆమె వివాహం చేసుకున్నారు.
కుమారుడు రోహన్ జైట్లీ:
అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ సైతం తండ్రి బాటలోనే న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ఎం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన రోహన్ జైట్లీ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలోనే రోహన్ జైట్లీ వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ.. తండ్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా రోహన్ జైట్లీ పెళ్లి వాయిదా పడింది.