Arvind Kejriwal invites PM Modi : ప్రధానీ మోదీకి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం
ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్.. తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.
న్యూ ఢిల్లీ : ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్.. తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీకి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ గోపాల్ రాయ్ పీటీఐతో మాట్లాడుతూ.. ''ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కానీ లేదా ఇతర కీలక నేతలను కానీ ఎవ్వరినీ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించడం లేదు'' అని అన్నారు. ''కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సర్కార్ వ్యతిరేకం అనే సంకేతాన్ని ఇవ్వడం ఇష్టం లేనందునే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని.. 2013, 2015లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవాలకు కూడా ఇతరులను ఎవ్వరినీ అతిథులుగా ఆహ్వానించలేదు'' అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన మరో నేత మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపి ఎంపీలను, కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలను అందరినీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
రామ్ లీలా గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ భారీ వేడుకకు జన సమీకరణ బాధ్యతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలకే అప్పగించింది. తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించాల్సిందిగా ఎమ్మెల్యేలకు ఆప్ నుంచి ఆదేశాలు వెలువడినట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..