ఢిల్లీ: ఢిల్లీకి పూర్తిస్థాయి హోదా కోసం తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మార్చి 1న మొదలుపెట్టనున్న దీక్షను ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేంత వరకు కొనసాగిస్తానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ''దేశమంతా అమలులో వున్న ప్రజాస్వామ్యం ఢిల్లీలో మాత్రం లేదని, ఇక్కడి ప్రజలు కూడా అన్నిచోట్లలాగే ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ.. అన్ని ప్రభుత్వాలకు వున్నటువంటి అధికారాలు ఏవీ ఢిల్లీ సర్కార్‌కి లేవని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు తమకు ఎంతో ఇచ్చారని, తిరిగి వారికోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికైనా తాను సిద్ధమే'' అని కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల్లో కలగజేసుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యేలా చేస్తోందని ప్రధాని మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అవసరమైతే, ఢిల్లీ పాలనకు, అభివృద్ధికి అడ్డం పడుతున్న ప్రధాని ఇంటి ఎదుటే ఆందోళనకు దిగుతానని కేజ్రీవాల్ హెచ్చరించారు. 


హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ విషయంలో కేంద్రం వద్ద అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఢిల్లీ విషయంలో మాత్రం అలా కాదని కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వస్తే, ఢిల్లీ వాసులకు ఉద్యోగాలు, ఇళ్లు, భద్రత, న్యాయం లభిస్తాయని అన్నారు.