ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఒకటి మర్చిపోకముందే మరొకటిగా అన్నట్టుగా తరచుగా ఏదో ఓ రకమైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూనే వున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సుప్రీం కోర్టులో కేసు వాదిస్తున్న లాయర్.. కేజ్రీవాల్‌కి గుడ్‌బై చెప్పారు. గతంలో డీడీసీఏ వివాదంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సుప్రీం కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదిస్తోన్న సీనియర్ న్యాయవాది అనూప్ జార్జ్ చౌదరి ఇకపై ఈ కేసు వాదించను అంటూ కేజ్రీవాల్‌కి గుడ్‌బై చెప్పారు. కేజ్రీవాల్ తన వద్ద వాస్తవాలు దాచిపెట్టారని, ఫలితంగా ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా తాను దాదాపు అవమానాలపాలు కావాల్సి వచ్చిందని చెబుతూ అనూప్ జార్జ్ చౌదరి తాజాగా ఇన్‌స్ట్రక్టింగ్ కౌన్సిల్ అనుపమ్ శ్రీవాస్తవ్‌కి ఓ లేఖ రాశారు. ఇదే విషయాన్ని తన క్లయింట్ అరవింద్ కేజ్రీవాల్‌‌కి కూడా దయచేసి మీరే చెప్పాలంటూ ఈ లేఖలో తన ఆవేదనను వ్యక్తపరిచారు.


 



అరవింద్ కేజ్రీవాల్‌కి ఓ న్యాయవాది గుడ్‌బై చెప్పడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ప్రముఖ సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలానీ సైతం కేజ్రీవాల్ నిజాలు చెప్పడం లేదంటూ అతడికి గుడ్‌బై చెప్పారు. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ తనకి ఇవ్వాల్సి వున్న రూ.2 కోట్లు కూడా తనకు అవసరం లేదని స్పష్టంచేశారు. వేల మందికి ఎన్నోకేసులు ఉచితంగా వాదించాను. అందులో అరవింద్ కేజ్రీవాల్ కేసు కూడా ఒకటి అనుకుంటాను అని అప్పట్లో రామ్ జెఠ్మలాని అభిప్రాయపడ్డారు.