కేజ్రీవాల్ ఆఫీసులో టీ, టీఫిన్ ఖర్చులు కోటి రూపాయలు దాటాయట..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. సీఎం ఆఫీసు కేవలం ఛాయ్, బిస్కెట్ల ఖర్చుకే 1.03 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందనే విషయం వెలుగుచూసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. సీఎం ఆఫీసు కేవలం ఛాయ్, బిస్కెట్ల ఖర్చుకే 1.03 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందనే విషయం వెలుగుచూసింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ హేమంత్ సింగ్ గౌనియా సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానంగా వచ్చిన పత్రంలో ఈ విషయం బహిర్గతమైంది.
వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఈ మూడేళ్లలో ప్రయాణం కోసం ఖర్చు పెట్టిన మొత్తం రూ.11.99 లక్షల రూపాయలుగా చూపిస్తూ ఆ పత్రం తెలపడం గమనార్హం. ఇక సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ ఖర్చుల చిట్టాని ఒకసారి పరిశీలిస్తే..చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. 2015-16 సంవత్సరానికి గాను సీఎం ఆఫీసు టీ, స్నాక్స్ ఖర్చులకు గాను రూ.23.12 లక్షలు లెక్కలు చూపించగా.. 2015-16 సంవత్సరానికి గాను ఆ ఖర్చును రూ.46.54 లక్షల రూపాయలుగా లెక్క చూపించారు. ఇక 2017-18 సంవత్సరంలో అదే ఖర్చు రూ.33.36 లక్షలుగా చూపించారు
అలాగే ఈ మూడు సంవత్సరాలలో సీఎం క్యాంపు ఆఫీసు ఖర్చులు రూ.5,59,280 రూపాయలుగా రికార్డు అవ్వగా.. సెక్రటరీ ఆఫీసులో టీ, స్నాక్స్ ఖర్చులను రూ.17,53,150 రూపాయలుగా లెక్క చూపించారు. ఈ ఖర్చులను సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేసిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ సింగ్, కేజ్రీవాల్ వైఖరిని తప్పు పట్టారు.
సీఎం తన కార్యాలయ ఖర్చు తగ్గించి..ఆ మొత్తాన్ని రోజుకు కనీసం ఒకపూట తిండికి కూడా నోచుకోని పేదవారికి అందివ్వాలని కోరారు. సీఎం ఆఫీసులు ఇలా ఖర్చు చేయడం కొత్త విషయం ఏమీ కాదు. గతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కూడా తాను సీఎం అయిన 10 నెలల్లోనే టీ, టిఫిన్ ఖర్చులను రూ.68 లక్షల రూపాయలుగా చూపించారు.