Election Results 2022: ముగిసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం!
Assembly Election Results 2022: ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలను నిలబెట్టుకుంది. ముఖ్యంగా యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కిచ్చుకుంది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఆప్ చీపురు ఊడ్చేసింది. కనీవినీఎరుగని రీతిలో ఘనవిజయం సాధించింది భారతీయ జనతా పార్టీ.
Assembly Election Results 2022: ఉత్తర భారతంలోని ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బీజేపీకి బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కమలం పార్టీ దూకుడు కనబరిచింది. ముఖ్యంగా యూపీలో కాషాయపార్టీకి ఎదురేలేకుండా పోయింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ నుంచి గట్టిపోటీ ఉంటుందని అంచనాలు వచ్చినా.. రిజల్ట్స్ లో మాత్రం బీజేపీ హవానే కొనసాగింది. మొదట్నుంచీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన అధికార బీజేపీ 260 కి పైగా సీట్లలో విజయదుంధుబి మోగించింది. గతంలో కన్నా సీట్లు తగ్గినా.. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది.
ఇక గెలుపుపై ఎంతో ఆశపెట్టుకున్న ఎస్పీకి నిరాశే మిగిలింది. పోయినసారి ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు, ఓట్లను మెరుగుపర్చుకున్నా అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. 130కి పైగా సీట్లను గెలుచుకొని ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఎన్నికల ముందునుంచే నిస్తేజంగా ఉన్న బీఎస్పీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను రంగంలోకి దింపినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. కేవలం రెండు స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం.
వరుసగా రెండోసారి..
ఉత్తరాఖండ్ లో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనావేసినా బీజేపీ విజయం ఏకపక్షమైంది. కాంగ్రెస్ కనీసపోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ 48 సీట్లలో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత ప్రచారం చేసినా ఖాతా తెరవలేకపోయింది. అయితే బీజేపీ అధికారం దక్కించుకున్నా.. సీఎం పుష్కర్ సింగ్ థామీ పరాజయం పాలయ్యారు. అటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా ఓడిపోయారు.
పంజాబ్ లో 'ఆప్' దందా
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. జాతీయపార్టీలను మట్టికరిపించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. ఆప్ ధాటికి సీఎం చన్నీతో పాటు పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ, శిరోమణి అకాలీదల్ అగ్రనేత సుఖ్ బీర్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమిపాలయ్యారు. ఆప్ 92 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఇక బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న అకాలీదల్ 4 సీట్లలో గెలుపొందగా.. అమరీందర్ సింగ్ పార్టీలో జతకట్టిన బీజేపీకి 2 స్థానాలు దక్కాయి. పంజాబ్ లో ఆప్ ఘనవిజయంతో భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గోవాలో గందరగోళం
గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కు ఒక్కసీటు దూరంలో నిలిచిపోయింది. గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీకి 20 సీట్లు దక్కగా.. కాంగ్రెస్ కూటమి 12 స్థానాల్లోనే గెలుపొందింది. ఇక గోవాలో అధికారం దక్కించుకుందామనుకున్న ఆప్ కు నిరాశే మిగిలింది. కేవలం రెండు సీట్లలోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంజీపీతో పాటు ఇండిపెండెంట్లు 6 సీట్లను దక్కించుకొని కీలకంగా మారారు.
మణిపూర్ లో కమల వికాసం
మణిపూర్ లో మరోసారి కమలం వికసించింది. స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు బీజేపీకి కనీసపోటీ ఇవ్వలేకపోయాయి. బీజేపీ 32 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ 4 సీట్లకే పరిమితమైంది. ఇక NPF ఐదు సీట్లలో.. NPP 8 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు 11 చోట్ల విజయం సాధించారు.
Also Read: CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్!
Also Read: UP Election Result: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం దూకుడు.. సంబురాలు ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook