పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరై, అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను కౌగిలించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత పంజాబ్‌ రాష్ట్ర కేబినెట్ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై వ్యక్తమవుతున్న విమర్శలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే బీహార్‌లోని ముజఫర్‌పూర్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో రాజద్రోహం నేరం కింద సిద్ధూపై ఓ కేసు నమోదు కాగా తాజాగా ఆయన తల నరికి తెచ్చినవారికి రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తామని భజరంగ్‌ దళ్‌ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు సంజయ్‌ జాట్‌ ప్రకటించడం సంచలనం రేపుతోంది. సంజయ్ జాట్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి పాక్ ఆర్మీ చీఫ్‌ని కౌగిలించుకోవడాన్ని ఓ సిగ్గుమాలిన చర్యగా శివసేన పార్టీ విమర్శించింది. సిద్ధూ చర్యను పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం తీవ్రంగా తప్పుపట్టారు. కానీ సిద్ధూ మాత్రం తన చర్యని తాను సమర్ధించుకోవడం గమనార్హం.