వేతన సవరణ కోసం ఇవాళ, రేపు బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వేతన పెంపు, ఇతర సమస్యలపై అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్సీ)తో బ్యాంకు యూనియన్లు న్యూఢిల్లీలో జరిపిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా తొమ్మిది సంఘాలకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సంయుక్తంగా ప్రకటించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి జూన్‌ 1 వ తేది ఉదయం 6 గంటల వరకు 48 గంటల సమ్మెకు యూనియన్స్‌ పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 2 శాతం వేతన సవరణ ప్రతిపాదనను బ్యాంకు యూనియన్స్‌తో పాటు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్స్‌ సైతం తిరస్కరించాయి. న్యాయబద్ధమైన వేతన సవరణను చేపట్టాలని బ్యాంక్‌ యూనియన్స్‌ ప్రధాన డిమాండ్‌.


బ్యాంకుల ఆపరేటింగ్ లాభాలను పెంచామని, ఉద్యోగుల ఖర్చు గణనీయంగా తగ్గిందని, బిజినెస్‌ను రెట్టింపు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించామని సంఘాలు పేర్కొన్నాయి. గత వేతన పెంపు కాలం 2012 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకు 15 శాతం వేతన పెంపును ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.


బుధ, గురువారాలలో బ్యాంకులు పని చేయనప్పటికీ జూన్‌ 1న ఉద్యోగులకు యథావిధంగా వేతనాలు జమవుతాయని అధికారులు చెప్పారు. ట్రెజరీల ద్వారా ఆన్‌లైన్‌లో బ్యాంకులకు వేతనాల చెల్లింపు జరిగిందని, 1వ తేది బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరవుతున్నందున వేతనాల చెల్లింపుకు ఇబ్బందులు ఉండే అవకాశం లేదని తెలిపారు. కాగా డిజిటల్ బ్యాంకింగ్, ఎటిఎం లావాదేవీలకు ఎటువంటి అవాంతరం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.