భీమా-కోరెగావ్‌ కేసులో అరెస్టయిన ఐదుగురు ప్రముఖ పౌరహక్కుల నేతల గృహ నిర్బంధాన్ని ఈ నెల 17వ తేదీ వరకూ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 28న మహారాష్ట్ర పోలీసులు ప్రముఖ పౌరహక్కుల నేతలు- వరవరరావు, వెర్నర్‌, అరుణ్‌ ఫెరీరా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌లను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు మరోమారు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అరెస్టులను సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు నలుగురు దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి.. పౌరహక్కుల నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉంచాలని ఆగస్టులో ఆదేశించింది. తర్వాత సెప్టెంబరు 6, సెప్టెంబర్ 12వరకు తేదీలను వరుసగా పొడిగిస్తూ.. తాజాగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీప‌క్ మిశ్, జస్టిస్ ఏ ఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం ఆదేశించింది.


ప్ర‌ధాని హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌న్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ ఐదుగురు ఇళ్లపై ఏకకాలంలో పూణే పోలీసులు సోదాలు జరిపి అరెస్టు చేయ‌డం.. అనంతర ప‌రిణామాల నేప‌థ్యంలో వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది.