మూడు రోజుల క్రితం పాట్నాలో జరిగిన బ్యాంకర్ల సదస్సులో పాత పెద్ద నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్‌తో నిరుపేదలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీహార్‌ సీఎం నితీశ్ కుమార్‌ మరోసారి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేయడంతోపాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారు. బీహార్‌ రాష్ట్ర విభజన చట్టం 2000 ప్రకారం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని డిమాండ్‌ చేసిన నితీశ్ కుమార్.. 15వ ఆర్థిక సంఘం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. 15వ ఆర్థిక సంఘం ప్రయోజనాలు రాష్ట్రాలకు ఏవిధంగా వర్తిస్తాయో వివరణ ఇవ్వడంతోపాటు 1971 నాటి జనాభా లెక్కల  ప్రకారం కాకుండా 2011 నాటి జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని  పట్టుపట్టారు. ప్రస్తుత జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపులు చేపడితేనే రాష్ట్రాలు అవసరాలు తీరుతాయని, అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో దూసుకెళ్తాయని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ అభిప్రాయాన్ని వినిపించారు.


ఇదిలావుంటే, బీజేపీ మద్దతుతో బీహార్‌లో అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని తరచుగా తాము విమర్శలు గుప్పిస్తున్న కారణంగానే ఆయన తాజాగా బీహార్‌‌కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తున్నారని, లేదంటే ఇప్పట్లో ఆ ఊసే ఎత్తేవారు కాదని అక్కడి ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.