తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్, టీచర్లు, 15 మంది స్టూడెంట్స్ సామూహిక అత్యాచారం!
బీహార్‌లోని చప్ప్రా ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. తనను సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది.
బీహార్‌లోని చప్ప్రా ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. తనను సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. ఏడు నెలలుగా తన స్కూల్ ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. పాఠశాలలో చదివే 15 మంది విద్యార్ధులు కూడా అత్యాచారం చేశారని ఆరోపించింది. ఈ ఘటనలపై ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బీహార్ పోలీసులు ప్రిన్సిపాల్, టీచర్, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు.
డిసెంబరు 2017లో తన తండ్రి జైలుకు వెళ్ళాడని, అదే నెలలో పాఠశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది.అ సమయంలో అత్యాచారానికి సంబంధించిన ఒక వీడియోను చిత్రీకరించారని, స్కూల్ లేదా ఇంట్లో చెప్తే ఈ వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారని, బ్లాక్ మెయిల్‌లకు దిగి.. మరికొంత మంది విద్యార్థులు, అలానే ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని ఓ జాతీయ పత్రిక నివేదించింది.
జైలు నుంచి తండ్రి విడుదలయ్యాక తనపై జరిగిన దుశ్చర్య గురించి ఆ బాలిక చెప్పగా.. ఆ కుటుంబం పోలీసుల వద్దకు వెళ్లింది. పోలీసులు మొదట ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చప్ప్రా పార్సగర్‌లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.