తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కిషన్ రెడ్డి  పాలమూరు యూనివర్శిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  టీఆర్ఎస్ పాలనలో నాలుగేళ్లుగా ఒక్క టీచర్‌ను కూడా విశ్వవిద్యాలయాలలో నియమించలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 2019లో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు.  టీఆర్‌ఎస్‌ తన నీడను తానే చూసి భయపడే స్థితికి చేరిందన్నారు.


కేసీఆర్‌వి కుల రాజకీయాలు 
ఎన్నికల సమయంలో బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్..ఆ తర్వాత అభివృద్ధి ఎజెండాను పక్కన బెట్టారని చెప్పారు. కులాల వారీగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కుల రాజకీయాలు చేసి పబ్బంగడువుకోవాలని చూస్తే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని కిషర్ రెడ్డి హెచ్చరించారు.