జమ్మూకాశ్మీర్ సర్కార్ నుంచి భారతీయ జనతా పార్టీ వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఇన్‌ఛార్జ్ రామ్ మాధవ్ మంగళవారం విలేకర్ల సమావేశంలో ఓ ప్రకటన చేశారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ కూటమితో తెగతెంపులు చేసుకుని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నట్లు స్పష్టంచేశారు. మూడేళ్ళ క్రితం పీడీపీ-బీజేపీ కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాదం, హింస పెచ్చుమీరడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాదులకు ఊతమందిస్తున్న స్థానికుల నుంచే ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో చర్చించిన అనంతరమే తాము ఈ నిర్ణయం తీసుకుని కాశ్మీర్‌ సర్కార్ నుంచి బయటికొచ్చినట్టు రామ్ మాధవ్ ఈ మీడియా సమావేశంలో తేల్చిచెప్పారు. 


బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి, ఆమె కేబినెట్ మంత్రులు తమ రాజీనామా లేఖలను రాష్ట్ర గవర్నర్ నరిందర్ నాథ్ వోహ్రాకు పంపించారు. దీంతో ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమవుతోంది.