Amit Shah on CAA protests: సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గం: అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై బీజేపీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని షా పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఏఏ అవగాహనా ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
జోద్‌పూర్ : పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరెన్ని నిరసనలు చేసినా.. ఈ విషయంలో బీజేపీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని షా పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఏఏ అవగాహనా ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇతరత్రా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అడ్డుకునే యత్నం చేసినా తాము వెనక్కి తగ్గబోమని షా స్పష్టం చేశారు.
Read also : అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చెల్లదు
దేశ ప్రజల ప్రయోజనం కోసం కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై విపక్షాలు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సీఏఏపై అవగాహనా ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని, ఈ క్రమంలోనే వీర్ సావర్కర్‌పై సైతం దుష్ప్రచారం చేసిందంటూ మండిపడ్డారు. సావర్కర్ లాంటి గొప్ప వ్యక్తులపై తప్పుగా కామెంట్లు చేయడం కాంగ్రెస్‌కు సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ కోటలోని ఓ ఆస్పత్రిలో వందకు పైగా శిశువులు చనిపోయినా నిర్లక్ష్యం వహించిన సీఎం అశోక్ గెహ్లాట్.. సీఏఏపై మాత్రం విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 88662-88662 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి సీఏఏకు మద్దతు తెలిపి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ టీమ్‌కు ప్రజలు తగిన రీతిలో బదులివ్వాలని దేశ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలకు సత్తా ఉంటే తమతో చర్చలకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. అయినా అర్థంకాకపోతే ఇటాలియన్ భాషలోకి అనువాదం చేసిస్తే చదువుకోవచ్చునంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అమిత్ షా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
కాగా, డిసెంబర్ 31, 2014 కంటే ముందు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే బిల్లును గతేడాది డిసెంబర్ నెలలో లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపగా.. రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఇక అది మొదలుకుని విపక్షాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి.