కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీలు ఒక కూటమిగా జత కట్టబోతున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ భవితవ్యంపై స్పందించడానికి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప నిరాకరించారు. కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోల్ అయిన చివరి ఓటు లెక్కించే వరకు తాము వేచిచూస్తామని యెడ్యూరప్ప స్పష్టంచేశారు. చివరి ఓటు కూడా లెక్కించి, పూర్తి ఫలితం తేలిన తర్వాతే పార్టీ భవితవ్యం ఏంటనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది అని అన్నారు. ఫలితాల వెల్లడి క్రమంలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణలపై స్పందించాల్సిందిగా కోరిన మీడియాతో మాట్లాడుతూ యెడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

బీఎస్ యెడ్యూరప్ప శిఖరిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇది ఎనిమిదోసారి. 1983 నుంచి యెడ్యూరప్ప బీజేపీ తరపున శిఖరిపుర నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. 1999లో ఒక్కసారి మాత్రమే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.