చెన్నై: ఆర్కే నగర్ ఉపఎన్నికలకు ఇక ఎనిమిది రోజులే సమయం ఉంది. చెన్నై కార్పొరేషన్ ఆర్కే నగర్ ఓటర్లకు పోలింగ్ బూత్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం 258 పోలింగ్ బూత్ లను, బ్యాలెట్ యూనిట్లను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిటీ కార్పొరేషన్ కేటాయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు సుమారు 15 శాతం ఈవీఎంలను సిద్ధం చేశారు. ఐదు రోజుల్లో ఎన్నికల సామాగ్రి, పోలింగ్ సిబ్బంది ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. డిసెంబరు 17 నాటికి బూత్ స్లిప్స్ పంపిణీ పూర్తవుతుంది. డిసెంబరు 19కి ముందు అన్ని పోలింగ్ బూత్లు ప్రాథమిక మౌలిక సదుపాయాలతో సిద్ధంగా వుంటాయి. ఈవీఎంలు, ఇంక్ మరియు ఓటర్ రోల్ వంటి ఎన్నికల సామాగ్రి డిసెంబర్ 20న పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటాయని కార్పొరేషన్ అధికారి తెలిపారు.


సిటీ పోలీసు అదనపు కమిషనర్ హెచ్.ఎం జయరాం మాట్లాడుతూ- ఆర్కే నగర్ ఎన్నికల్లో నిఘా పెంచామని.. 20 బృందాలతో ద్విచక్ర వాహనాల ద్వారా పెట్రోలింగ్ ప్రారంభించామని తెలిపారు. రాత్రి సమయంలో ఈ బృందాల నిఘా ఎక్కువగా ఉంటుంది. ఓట్ల లెక్కింపు లెక్కింపు రోజు వరకు షిఫ్ట్ ఆధారంగా పని చేస్తారు. ఐదు పారా మిలటరీ కంపెనీలలో మూడు ఇప్పటికే ఆర్కే నగర్ కు చేరుకున్నాయి. మరో రెండు కంపెనీలు ఈ వారాంతానికి చేరుకుంటాయని పోలీసు వర్గాలు తెలిపాయి.


ఎన్నికల అధికారుల ప్రకారం ఇప్పటివరకు 5.21 లక్షల నగదు, 500 ప్రెజర్ కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే నగర్ లో 74 అనుమానిత వాహనాలను అదుపులో తీసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా.. నగదు పంపిణీ లాంటివి జరక్కుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు మూడువందల పైగా సీసీటీవీ కెమెరాలను బిగించారు.