సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. నమాజ్ చేసేందుకు ఆయన వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఉన్నట్టుండి కిందపడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. ఆయనను కొద్ది గంటలు ఐసీయూలో ఉంచారు. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అనుకూలించలేదు. ఈ క్రమంలో ఆయన మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మరణవార్తను బెంగళూర్‌లోని ఫోర్టిస్‌ ఆస్పత్రి సిబ్బంది ధ్రువీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి అంబరీష్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే జాఫర్ మరణవార్త కాంగ్రెస్ శిబిరంలో విషాద ఛాయలు తీసుకొచ్చింది.  కాంగ్రెస్ పార్టీలో జాఫర్ ఎన్నో కీలక పదవులు పొందారు. 1980 నుండి 1984 సంవత్సరాల మధ్య రైల్వే సహాయ మంత్రిగా పనిచేసిన జాఫర్.. ఆ తర్వాత 1991-95 ప్రాంతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  ఏడుసార్లు ఎంపీగా  గెలిచిన జాఫర్.. 2009లో మాత్రం బీజేపీ అభ్యర్థి చంద్రగౌడ చేతిలో ఓడిపోయారు. 


కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప వద్ద రాజకీయ శిష్యరికం చేసిన జాఫర్.. రైల్వే మంత్రిగా పలు సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా బ్రాడ్ గేజ్ల నిర్మాణాన్ని విరివిగా చేపట్టి రైల్వేకి డబ్బుని ఆదా చేయడంలో దోహదపడ్డారు.  బెంగళూరులో వీల్ అండ్ యాక్సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కూడా జాఫర్ పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు. ఆయన తన భార్యతో పాటు ఇద్దరు కుమారులనూ కోల్పోయి.. ఒంటరిగా జీవించేవారు. జాఫర్ మరణం పట్ల కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.