టాటూ కలిగిఉన్న అభ్యర్థులకు డిఫెన్స్ లో(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) ఉద్యోగాలు వస్తాయా.. అంటే అందుకు గ్యారెంటీ లేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోయింది. వివరాల్లోకి వెళితే.. భారత వైమానిక దళంలో ఒక వ్యక్తి ఎయిర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా.. అతని మోచేతి మణికట్టు బయటివైపు శాశ్వత పచ్చబొట్టు ఉందనే కారణంతో భారత వైమానికదళం అతని నియామకాన్ని రద్దు చేసింది. బాధితుడు హైకోర్టులో సవాల్ చేయగా.. ఢిల్లీ హైకోర్టు కూడా వైమానిక దళం యొక్క నిర్ణయాన్నే సమర్ధించింది. ఎయిర్ ఫోర్సు కొన్ని సడలింపులతో కొన్ని రకాల పచ్చబొట్లను అనుమతిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని గిరిజనుల విషయంలో కూడా సడలిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మసనం ఈ కేసును స్వీకరించి  వాద ప్రతివాదనలను విన్నది. "అభ్యర్థి యొక్క శరీరం మీద ఉన్న పచ్చబొట్టు ఎయిర్ ఫోర్సు నిబంధనలకు అనుగుణంగా లేదు. అలాగే దరఖాస్తును సమర్పించే సమయంలో కూడా అతను తన పచ్చబొట్టు ఫొటోగ్రాఫ్ ను సమర్పించడంలో విఫలమయ్యాడు. ఐఏఎఫ్ జారీ చేసిన ప్రకటనలో సూచించిన విధంగా అతని అప్లికేషన్ లేదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది.    


పచ్చబొట్లను ముంజేయి యొక్క ముంగిలి (మోచేతికి మణికట్టుకు లోపల),  చేతి వెనుక భాగం లేదా అరచేతికి వెనుక వైపు మరియు గిరిజనుల (ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా) పచ్చబొట్లను మాత్రమే అనుమతిస్తామని ఐఏఎఫ్ కోర్టుకు వివరించింది. 


అయితే తన నియామకాన్ని ఎలా రద్దు చేస్తారని.. నేను శరీరంపై పచ్చబొట్టు ఉందని డిక్లేర్ చేసి సర్టిఫికేట్ సమర్పించానని.. కాల్ లెటర్ కూడా జారీ చేశారని బాధితుడు వివరించే ప్రయత్నం చేశాడు. ఈ పిటిషన్ ను బెంచ్ విచారించి "పిటిషనర్ యొక్క శరీరం మీద పచ్చబొట్టు ఐఏఎఫ్ ప్రకటనలో సూచించిన విధంగా లేనందున అతని నియామక రద్దు నిర్ణయం సమర్ధనీయమే" అని తీర్పునిచ్చింది. 


బాధితుడు సెప్టెంబర్ 29, 2016న వైమానిక దళంతో ఎయిర్మన్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 2017లో వ్రాతపూర్వక, శారీరక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. వైద్య పరీక్షలకు కూడా హాజరయ్యాడు. గతేడాది నవంబరులో.. డిసెంబరు 24, 2017న రిపోర్టు చేయవలసిందిగా  కాల్ లెటర్ కూడా జారీ చేసింది ఐఏఎఫ్ . తీరా.. రిపోర్టు చేసే సమయంలో శాశ్వత పచ్చబొట్టు కారణంగా అతని నియామకం రద్దైంది.