మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో దొంగలు పడ్డారు
మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పి. చిదంబరం నివాసంలో చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం నివాసంలో చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 1.1 లక్షల రూపాయల నగదుతో పాటు పలు బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు వారు తెలిపారు. ఈ ఘటన గురువారం జరిగిందని.. ఆరోజు చిదంబరం ఇంట్లో లేనందున ఆయన కుటుంబసభ్యులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. చెన్నైలోని నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్‌లో చిదంబరం నివాసం ఉంది.
చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి తిరిగి వచ్చి, తలుపుల తాళం తీసి లోపలికి వెళ్లగా.. ఈ దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అల్మరాలు ఓపెన్ చేసి ఉండడం, అందులోని ఆభరణాలు, నగదు దొంగిలించబడ్డాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 1.1 లక్షల నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇంట్లో పనిచేసే ఇద్దరు ఈ పనికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే, మాస్క్‌లు ధరించిన ఇద్దరు ఆడవాళ్లు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని.. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్నిఫ్ఫర్ డాగ్స్‌ను తేనున్నామని, ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నామని అన్నారు. కాగా చిదంబరం కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నారు.