హైదరాబాద్‌లో ఎస్బీఐకి రూ.65 కోట్ల శఠగోపం పెట్టిన మరో కంపెనీ
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టిన నిరవ్ మోదీ, మెహుల్ చోక్సీల మోసాల కేసులు ఇంకా ఓ కొలిక్కి రాకముందే తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో కుంభకోణం !
బ్యాంకుల వద్ద భారీ మొత్తంలో రుణాలు తీసుకుని, చివరకు ఆ రుణాలు ఎగ్గొట్టి బ్యాంకులకు శఠగోపం పెడుతున్న సంస్థల బాగోతాలు నిత్యం ఏదో ఓ చోట వెలుగుచూస్తూనే వున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకుకు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన నిరవ్ మోదీ, మెహుల్ చోక్సీల మోసాల కేసులు ఇంకా ఓ కొలిక్కి రాకముందే తాజాగా హైదరాబాద్‌లోని ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు హైదరాబాద్‌కే చెందిన జే అంబె గౌరి కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ శఠగోపం పెట్టిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.65.39 కోట్ల రుణం తీసుకున్న జే అంబే గౌరీ కెమికల్స్ కంపెనీ.. ఇప్పటివరకు ఆ రుణం చెల్లించలేదు. దీంతో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ పటేల్ సహా సంస్థలోని 8 మంది డైరెక్టర్స్, సంస్థ ఈ రుణం పొందేందుకు సహకరించిన బ్యాంక్ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని మిడ్ కార్పొరేట్ రీజినల్ ఆఫీస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 2009లోనే జే అంబె గౌరి కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకు నుంచి ఈ రుణం పొందగా.. 2014 ఏప్రిల్ 30న నష్టాలను సాకుగా చూపుతూ కంపెనీ చేతులెత్తేసినట్టు సమాచారం. ఈ ఉదంతంపై 2016 అక్టోబర్‌లోనే బ్యాంకు సిబ్బంది ఆర్బీఐకి సైతం ఫిర్యాదు చేసినట్టు ఇండియా టుడే కథనం స్పష్టంచేసింది. ఈ కుంభకోణంపై మరింత సమాచారం అందాల్సి వుంది.