ఢిల్లీ: పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీఘడ్, హర్యానా రాష్ట్రాల్లోని 22 విద్యా సంస్థలపై సీబీఐ దాడులు నిర్వహించింది. రూ.250 కోట్ల స్కాలర్‌షిప్ కుంభకోణం కేసులో సీబీఐ ఈ దాడులు జరిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, షిమ్లా, సోలన్, బిలాస్‌పూర్, చంబ, కంగ్ర, షిర్మోర్, పంజాబ్‌లోని మొహాలి, నవన్ శహర్, గుర్దాస్‌పూర్, హర్యానాలోని కర్నాల్, అంబాలలోని విద్యా సంస్థల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసి, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల కోసం కేటాయించిన రూ.250 కోట్ల స్కాలర్‌షిప్స్ పంపిణిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని గుర్తించిన అనంతరం ఈ దాడులు చేపట్టామని ఓ సీబీఐ అధికారి పేర్కొన్నట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. 


ఎస్సీ, ఎస్టీ, ఓబీసి, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సిన స్కాలర్‌షిప్స్ ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయనేది ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ.