సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల; బాలికలదే పైచేయి
సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ బోర్డు ఫలితాలను ప్రకటించింది
సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ బోర్డు ఫలితాలను ప్రకటించింది. తొలుత ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించినా.. పలు కారణాల రీత్యా కొద్దిసేపటి క్రితం ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 లక్షల మంది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రాశారు. బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ www.cbse.nic.in, www.cbseresults.nic.inలలో విద్యార్ధుల ఫలితాలను తెలుసుకోవచ్చు.
గురుగ్రామ్‌కు చెందిన ప్రఖర్ మిట్టల్, బిజ్నార్‌కు చెందిన రిమ్జిమ్ అగర్వాల్, శంలీకి చెందిన నందిని గార్గ్, కొచ్చికి చెందిన శ్రీలక్ష్మి జి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 500కు 499 మార్కులు సాధించారు.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల మొత్తం ఉత్తీర్ణత 86.70 శాతం. బాలురు ఉత్తీర్ణత శాతం 85.32 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 88.67గా ఉంది. పరీక్షల్లో విజయం సాధించిన వారికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేర్ అభినందనలు తెలిపారు.
సీబీఎస్ఈ పదవ తరగతి,12వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది సుమారు 28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 18 వరకు జరిగిన పదవ తరగతి పరీక్షలకు భారతదేశవ్యాప్తంగా 4,453 కేంద్రాలు, 78 విదేశీ కేంద్రాలలో 16,38,420 మంది హాజరయ్యారు.
సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలు 2018:
- సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లను సందర్శించండి - cbse.nic.in లేదా cbseresults.nic.in
- ఫలితాలు 2018 కోసం లింక్ పై క్లిక్ చేయండి
- వివరాలను సరిగా నమోదు చేయండి రోల్ నెంబర్ వంటివి
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
- ఫలితాలు డిస్ ప్లే మీద కనిపిస్తాయి.
- రిజల్ట్ ను పీడీఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.