బెంగళూరు: చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం విఫలమైందని నిరాశ చెందిన వారికి ఇస్రో చీఫ్ డా కె శివన్ ఓ శుభవార్త వెల్లడించారు. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ లొకేషన్‌ని గుర్తించామని, అయితే, విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం మార్పిడికి వీలుగా సంబంధాలు ఇంకా పునరుద్ధరణ అవలేదని ఇస్రో చీఫ్ స్పష్టంచేశారు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ లొకేషన్‌‌కి సంబంధించిన థర్మల్ ఇమేజ్‌ని బంధించినట్టు ఇస్రో చీఫ్ ప్రకటించారు. రానున్న 14 రోజులపాటు విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేట్ అయేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని ఇదివరకే ఇస్రో చేసిన ప్రకటనకు తోడు తాజాగా వెలువడిన ప్రకటన చంద్రయాన్-2 ప్రయోగంపై మరోసారి ఆశలను చిగురింపజేసింది. ఒకవేళ విక్రమ్ ల్యాండర్‌తో కానీ ఇస్రోకి సంబంధాలు ఏర్పడగలిగితే, చంద్రయాన్-2 ప్రయోగం 100శాతం పూర్తయినట్టే.


చంద్రయాన్-2 ప్రయోగంలో మూడు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఆర్బిటర్, రెండోది ల్యాండర్ (విక్రమ్), రోవర్(ప్రగ్యాన్). ఇస్రోతో చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కి సంబంధాలు ఉన్నప్పటికీ.. విక్రమ్‌తోనే ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. అయితే, తాజాగా ఆర్బిటర్ తీసిన చిత్రాల్లోనే విక్రమ్ లొకేషన్ చిక్కడం ఆశలను రేకెత్తిస్తోంది.