ఇటీవలే హీరో కార్తి నటించిన ఖాకీ చిత్రం చూశారా.. అందులో పోలీస్ అధికారైన హీరో హంతకులను పట్టుకోవడం కోసం ఉత్తరాది ప్రాంతాలకు వెళ్ళి అన్వేషణ సాగిస్తాడు. ఎన్నో అగచాట్లు పడి ఆఖరికి ప్రమాదకరమైన హంతకుల ముఠాను పట్టుకుంటాడు. అచ్చం అలాంటి కథే ఈ మధ్యకాలంలో తమిళనాడు పోలీస్  పెరియపాండి జీవితంలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై కొళత్తూరు కడపరోడ్డులో ఒక బంగారు షాపును భారీగా కొల్లగొట్టిన ఓ ఉత్తరాది దొంగల ముఠా రాజస్థాన్‌‌లో ఉందని తెలియడంతో రాజమంగళం క్రైం పోలీసులు  మదురవాయిల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెకర్‌ పెరియపాండి నాయకత్వంలో రాజస్థాన్ బయలుదేరారు. 


అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేసి, లోకల్ పోలీసుల సహాయంతో దుండగులను పట్టుకోవడానికి పథకాన్ని రచించారు. ఓ పాడుపడిన ఇంట్లో దొంగల ముఠా ఉందని తెలుసుకున్న పెరియపాండి, తన పోలీసులతో ఒక ప్లాన్ రచించి.. అందులో భాగంగా వేకువ ఝామున 2 గంటల ప్రాంతంలో.. ఆ ఇంటిని చుట్టుముట్టారు. అయితే స్థానికులతో కలిసి, దొంగల ముఠా ఎదురుదాడి చేయడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. పైగా అదనపు సిబ్బంది కూడా లేకపోవడంతో.. ఉన్న ఆయుధాలతోనే వారు దొంగలను ప్రతిఘటించారు.


ఈ క్రమంలో దుండగులు చేసిన ఎదురు కాల్పులలో భాగంగా తూటాలు పెరియపాండి గుండెల్లోకి దూసుకెళ్లాయి. స్థానిక బలగాలు వచ్చి పరిస్థితిని ఒక దారికి తీసుకొచ్చే వరకు ఆయన రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడాల్సి వచ్చింది. తర్వాత ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో దారిలోనే పెరియపాండి ప్రాణాలు విడిచారు.


'రియల్ పోలీస్' పెరియపాండి
వాస్తవంగా జరిగిన ఈ కథలో పోలీసుల దాడి అంతా ఒక సినిమా ఫక్కీలో సాగడం గమనార్హం. ఈ దాడిలో మరణించిన పెరియపాండికి తమిళనాడు  పోలీసు శాఖలో నిజాయతీ గల ఆఫీసరుగా పేరుంది. 1969లో జన్మించిన ఆయన 2000 సంవత్సరంలో తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా నియమితులయ్యారు. దోపిడీ కేసులను దర్యాప్తు జరిపి నేరస్థులను పట్టుకోవడంలో పెరియపాండికి విశేష అనుభవం ఉంది.


ఈ క్రమంలో అనేకసార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు పెరియపాండి. ఇటీవలే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా కూడా పదోన్నతి పొందారు ఆయన. ధైర్యసాహసాలు కలిగిన ఒక మేటి పోలీసుగా మన్ననలు అందుకున్న పెరియపాండి మృతి వార్త తెలియగానే తమిళనాడు పోలీస్ శాఖ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆయన కుటుంబానికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. అలాగే కోటి రూపాయలను ఆయన కుటుంబానికి పరిహారంగా కూడా ప్రకటించారు.