దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి ప్రపంచమే కాదు.. భారత పొరుగు దేశమైన చైనా కూడా ఫిదా అయింది. ప్రతీ విషయంలో భారత్ ఒకటి అంటే, తాను మరొకటి అనే చైనా.. ఈసారి మోడీ ప్రసంగంలో అంశాలతో మాత్రం ఏకీభవిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచీకరణ, ప్రొటెక్షనిజం ( స్వదేశీ వస్తు రక్షణ విధానం) లాంటి అంశాల గురించి మోడీ చెప్పిన మాటల్లో వాస్తవం వుందన్న చైనా.. ఈ విషయంలో భారత్, చైనా అభిప్రాయం ఒక్క విధంగానే వున్నాయని స్పష్టంచేసింది. మోడీ ప్రస్తావించిన అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సహా ప్రపంచదేశాలన్నింటికీ వర్తిస్తాయి చైనా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ప్రపంచీకరణను ప్రోత్సహిస్తూ స్వదేశీ వస్తు రక్షణ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్, చైనా అభిప్రాయాలు ఒక్కటే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా గతేడాది దావోస్ వేదికపై ఇవే అంశాలని ప్రస్తావించారు అని ఈ సందర్భంగా హువా చున్‌యింగ్ గుర్తుచేసుకున్నారు.