అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం మళ్లీ తెరమీదకి వస్తున్న క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడే స్వయంగా ఆలయాన్ని ఎప్పుడు నిర్మించాలో నిర్దేశిస్తాడని ఆయన తెలిపారు. ఎప్పుడు జరగాల్సిన పని అప్పుడే జరుగుతుందని.. ఒకసారి దైవం అనుగ్రహిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా.. కాగల కార్యాన్ని ఆపలేరని ఆయన అన్నారు. లక్నోలో ఓ సమావేశానికి హాజరైన ఆదిత్యనాథ్ అక్కడి విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ప్రభుత్వాలు కనీసం రామజన్మభూమి ప్రాంతాన్ని సందర్శించాలన్నా కూడా భయపడేవని.. తాను అధికారంలోకి వచ్చాక మాత్రమే ఆ ప్రాంతాన్ని పదే పదే సందర్శిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నానని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే తాను విద్యా విధానాన్ని కూడా మార్చాలని భావిస్తున్నానని ఆదిత్యనాథ్ అన్నారు. తన ప్రభుత్వం ఆధునిక, సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తుందని.. మదర్సాల విద్యా వ్యవస్థలో కూడా తాను మార్పులను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. 


ప్రతిపక్షాలు అన్నీ సమాయత్తమవుతూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చూస్తున్నాయని.. కానీ ఆ విధంగా జరగదని.. వారి మహాగట్బందన్ (అతి పెద్ద కూటమి)ని ప్రజలు కోరుకోరని.. ఎందుకంటే ఎవరికి నాయకత్వం కట్టబెట్టాలన్న సమస్య ఉత్పన్నమవుతుందని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినాసరే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం స్థిరంగానే ఉంటుందని.. అందులో సంశయమే లేదని ఆయన అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తామే మరల విజయ పతాకం ఎగరవేస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.