బీజేపీ రూట్‌లోనే గోవాపై కాంగ్రెస్, బీహార్‌పై ఆర్జేడీ కన్ను
కర్ణాటకలో వచ్చిన అధికారం మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టనుందా ?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది అనే కారణంతోనే ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి ఇవ్వడంపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు బీజేపీని ఆ పార్టీ రూట్‌లోనే దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ.. మెజార్టీ మాత్రం బీజేపీ వైపు వుండటంతో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు అక్కడి గవర్నర్. అదే విధంగా బీహార్‌లోనూ అధిక సంఖ్యలో స్థానాలు గెలుచుకున్న ఆర్జేడీకి కాకుండా బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీ, ఇతరుల కలయికతో ఏర్పడిన కూటమికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది.
ఇదిలావుంటే, కర్ణాటకలో మాత్రం గోవా, బీహార్ రాష్ట్రాలకు భిన్నంగా అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్న బీజేపీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గోవాలో, ఆర్జేడీ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిటిషన్ పెట్టుకునే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. అదే కానీ జరిగితే కర్ణాటక రాజకీయాలు అక్కడితో ఆగకుండా మరో రెండు రాష్ట్రాలకు పాకినట్టే అవుతుంది. అంతేకాకుండా దేశంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.