న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్‌ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు ప్రతాప్ సింగ్, అమీ హర్షాడ్రే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.  దీనితో కాంగ్రెస్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ తమ పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. కాగా దీపక్ మిశ్రాను తప్పించాలని విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని వెంకయ్య నాయుడు తిరస్కరించడంతో పాటు.. నిబంధనలకు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.


జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా ఏడు విపక్ష పార్టీలు ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 64 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అందించారు. అయితే ఈ నోటీసును వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీంతో ఉపరాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. మంగవారం పరిశీలిస్తామని న్యాయస్థానం చెప్పింది. నేడు విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. రాజ్యంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.