Coromandel Express train Tragedy: ఒడిషాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాదం దుర్ఘటన దేశ చరిత్రలోనే అతి పెద్ద ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒడిషా రైలు ప్రమాదంలో దుర్మరణంపాలైన వారి సంఖ్య 261 కి చేరింది. దాదాపు 900 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిలోనూ తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ ఘటన సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఒక శుక్రవారం జరిగిన మరో దుర్ఘటనను గుర్తుచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహనగ బజార్ స్టేషన్ కి సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. దేశ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద రైలు ప్రమాదంగా రికార్డులు చెబుతున్నాయి. గతంలో.. అంటే 1999 లో గైసల్ రైలు ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ తరువాత 11 ఏళ్లకు.. అంటే 2010 లో జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం జరిగింది. ఈ రెండు ప్రమాదాలు కూడా పశ్చిమ బెంగాల్‌లో జరిగినవే.  


తాజాగా కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ 2009 నాటి బ్లాక్ ఫ్రైడే కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌ని గుర్తుచేస్తోంది. ఏంటి గతంలోనూ ఇదే కోరమండల్ ట్రైన్ ఇలాగే శుక్రవారం నాడు యాక్సిడెంట్‌కి గురైందా అని అనుకుంటున్నారా ? అవును నిజమే... 2009 లో ఫిబ్రవరి 13 శుక్రవారం నాడే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. హౌరా నుంచి చెన్నైకి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లా కేంద్రంలో సమీపంలో పట్టాలు మారే క్రమంలో పట్టాలు తప్పింది. 


ఆరోజు కూడా నిన్నటి శుక్రవారం తరహాలోనే రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 7.40 గంటల మధ్య ప్రాంతంలోనే రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో 11 స్లీపర్ క్లాస్ బోగీలు ఉండగా.. మరో రెండు జనరల్ కేటగిరీ బోగీలు ఉన్నాయి. పీటీఐ వెల్లడించిన ఒక కథనం ప్రకారం ఆనాటి రైలు ప్రమాదంలో 16 మంది చనిపోగా.. 161 మందికి గాయాలయ్యాయి.