హైదరాబాద్: తెలంగాణలో గత 13 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీపీఐ నేత నారాయణ ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. సీఎం కేసీఆర్‌ వైఖరి కారణంగా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ వారి శవాల మీద నడుచుకుంటూపోయారని నారాయణ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని, కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన జాతీయ మానవ హక్కుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. 


ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ.. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఇకనైనా కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు మానుకోకుంటే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుందని అన్నారు. శనివారం ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌కు అన్నివర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.