జమ్మూ కాశ్మీర్‌లోని నౌహట్టా ప్రాంతంలో ఆర్మీ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనా మందిరం నుంచి ప్రజలు బయటకు వస్తున్న సమయంలో సీఆర్పీఎస్ వాహనం అటువైపు రావడంతో ఆగ్రహించిన వారు దాడికి ప్రయత్నించారు. దీంతో డ్రైవర్ వాహన వేగం పెంచగా జన సమూహంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ పౌరుడు అక్కడికక్కడే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వాహనాన్ని ధ్వంసం చేశారు.  దీంతో శ్రీనగర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్, బుద్గంలలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



 


సెక్షన్ 307(హత్యాయత్నం), 148(అల్లర్లు), 279 (అతి వేగం), ఇతర సెక్షన్ల కింద జమ్మూ కాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ శ్రీనగర్ యూనిట్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిపై మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.  కాల్పుల విరమణ అంటూనే బుల్లెట్లతో రోజూ చేసే(చంపేసే) పనిని జీపుతో చేస్తున్నారా? అని ప్రశ్నించారు.


ఉగ్రవాదుల చొరబాటు.. అలర్ట్



జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మందికిపైగా ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా సంస్థల నివేదికలు తెలిపాయి. దీంతో కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు సరిహద్దు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా దేశంలోకి చొరబడినట్లు తెలిపాయి. దీంతో మరింత అప్రమత్తమైన పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు.