నిరాహార దీక్షలో స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్.. ఆస్పత్రికి తరలింపు
మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కేసుల్లో దోషులకు ఆరు నెలల్లో ఉరి శిక్ష విధించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆదివారం ఉదయం దీక్షాశిబిరంలోనే అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు.
న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కేసుల్లో దోషులకు ఆరు నెలల్లో ఉరి శిక్ష విధించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆదివారం ఉదయం దీక్షాశిబిరంలోనే అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెను సమీపంలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 3న చేపట్టిన స్వాతి మాలివాల్ నిరాహార దీక్ష ఆదివారంతో 13 రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఆమె మహిళలకు రక్షణ కల్పించి వారిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు అంతే కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
దిశ ఘటన అనంతరం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ దిశ చట్టం 2019 ఆమోదించిన నేపథ్యంలో దిశ చట్టాన్ని వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతూ శనివారమే స్వాతి మాలివాల్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు.