Arvind Kejriwal: ఈడీ విచారణకు హాజరుకాని అరవింద్ కేజ్రీవాల్, ఈడీకు లేఖ
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంటోంది. మద్యం కేసులో కొత్తగా ఈడీ రంగంలో దిగింది. విచారణకు హాజరుకావల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపింది. ఆ తరువాత ఏం జరిగింది...
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ విచారించగా, ఇప్పుడు ఈడీ విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. అయితే షెడ్యూల్ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజురుకాలేనని కేజ్రీవాల్ ఈడీకు లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇటీవలే మనీష్ బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. ఈ కేసును దర్యాప్తు చేసున్న సీబీఐ, ఈడీలు ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అవినీతి, నేరపూరిత అభియోగాలపై అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్ 16వ తేదీన 9 గంటలు ప్రశ్నించింది. సీబీఐ విచారించిన ఆరు నెలల తరువాత ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. నవంబర్ 2వ తేదీ అంటే ఇవాళ విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపింది.
అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడంపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఏదో విధంగా అంతం చేసేందుకు ఈడీ, సీబీఐ సహాయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ నోటీసులపై మండిపడ్డారు. ఈ నోటీసులు చట్ట విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో తాను ప్రచారం చేయాల్సి ఉన్నందున వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈడీకు లేఖ ద్వారా సమాధానమిచ్చారు కేజ్రీవాల్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరు కావడం లేదని అరవింద్ కేజ్రీవాల్ ఈడీకు తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మద్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది ప్రీ షెడ్యూల్ కార్యక్రమమైనందున విచారణకు రాలేనన్నారు. ఏ హోదాలో అంటే సాక్షిగా లేదా నిందితుడిగా నోటీసుల పంపించారో స్పష్టత లేదన్నారు. ఈ కేసులో తనను వ్యక్తిగతంగా పిలిచారా లేక ముఖ్యమంత్రిగా పిలిచారా అనేది ప్రస్తావించలేదన్నారు.
ఈడీ ముందున్న అవకాశాలు
ఒక వ్యక్తికి ఈడీ మూడు సార్లు నోటీసులు లేదా సమన్లు పంపించవచ్చు. ఆ తరువాత కోర్టు అనుమతితో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా విస్మరిస్తే అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చవచ్చు. అదే సమయంలో ఆ వ్యక్తి సమన్లను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించవచ్చు లేదా ముందస్తు బెయిల్ కోరవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook