దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి పెట్రోల్‌ విక్రయాలు నిలిపివేయనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించాలని పెట్రోల్ డీలర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇందుకోసం నగరంలో నేటి నుంచి పెట్రోల్‌ విక్రయాల బంద్‌ పాటించనుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో సీఎన్‌జీ పంపిణీ కేంద్రాలతో పాటు మొత్తం 400 పెట్రోల్ బంక్‌లున్నాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు (మంగళవారం) ఉదయం 5 గంటల వరకు పెట్రోల్ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు డీలర్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా పెట్రోల్‌ విక్రయాల బంద్‌తో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. క్యాబ్, బస్, ఆటో రిక్షాలను ఆశ్రయించే ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.



 


వరుసగా ఐదో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు


గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చమురు ధరల నుంచి సామాన్యులకు మరి కొంత ఊరట లభించింది. వరుసగా ఐదో రోజు సోమవారం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.


ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 27 పైసలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81.44గా, డీజిల్‌ రూ.74.92గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 28 పైసలు తగ్గాయి. ధరలు తగ్గిన అనంతరం ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.86.91గా, డీజిల్‌ రూ.78.54గా ఉంది.


అలాగే కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. సోమవారం కోల్‌కతా‌లో లీటరు పెట్రోల్ 83.29 రూపాయలుగా, లీటర్ డీజిల్ రూ. 76.77గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరు 84.64 రూపాయలుగా, డీజిల్ ధర లీటరు రూ.79.22 వద్ద స్థిరపడింది. (మూలం: ఐఓసీఎల్ వెబ్‌సైట్ ఆధారంగా)


అటు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ.86.34, డీజిల్ ధర లీటర్ రూ.81.49కి చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.85.42గా, డీజిల్‌ రూ.80.20గా ఉంది.