Delhi Politics: ఢిల్లీ అసెంబ్లీలో రాత్రంతా నిరసనల పర్వం... ఆప్, బీజేపీ పోటాపోటీ ధర్నాలు..
Delhi Politics AAP and BJP Overnight Dharna: ఢిల్లీ పాలిటిక్స్‌లో ఆప్-బీజేపీ మధ్య ఫైట్ ముదురుతోంది. మనీష్ సిసోడియాపై లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ అవినీతి ఆరోపణల విషయంలో ఆప్ దూకుడుగా ముందుకెళ్తున్నాయి.
Delhi Politics AAP and BJP Overnight Dharna: ఢిల్లీ అసెంబ్లీలో రాత్రంతా నిరసనల పర్వం కొనసాగింది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ ప్రాంగణంలో పోటాపోటీగా ధర్నాలకు దిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆప్ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా ధర్నా చేపట్టింది. అటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
అసెంబ్లీలో రాత్రంతా ధర్నా చేపడుతున్నట్లు ఆప్ ప్రకటించిన కొద్ది గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ధర్నాకు దిగారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, బీజేపీ ఎమ్మెల్యేలు భగత్ సింగ్, రాజ్‌గురు విగ్రహాల వద్ద ప్లకార్డులు చేతపట్టి ధర్నా చేపట్టారు. ఆప్‌కి 62 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 10 మంది మాత్రమే ధర్నాలో కూర్చొన్నారని.. సీఎం కేజ్రీవాల్ సహా మిగతావారంతా ఇళ్లల్లో విశ్రాంతి తీసుకున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.
ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1400 కోట్ల స్కామ్ చేశారని ఆరోపిస్తూ ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని ధర్నా సందర్భంగా ఆప్ డిమాండ్ చేసింది. సక్సేనాపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు, ఆప్ తీరును బీజేపీ తీవ్రంగా తప్పు పడుతోంది. కేంద్రాన్ని బద్నాం చేయడానికే ఆప్ అసెంబ్లీని ఉపయోగించుకుంటోందని... దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
అంతకుముందు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ 'ఆపరేషన్ లోటస్' ఫెయిల్ అయిందని నిరూపించేందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానం కన్నా ముందు బీజేపీ ఎమ్మెల్యేలు లిక్కర్ స్కామ్‌పై చర్చకు పట్టుబట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook