ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis resigns) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో కలిసి ఏర్పాటు చేసిన తమ ప్రభుత్వానికి సరైన మద్దతు లేనందున తాము రాజీనామా చేస్తున్నట్టు ఫడ్నవిస్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కి పంపిస్తున్నట్టు చెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్.. విలేకరుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పుని గౌరవించే తాము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నాం. కానీ శివ సేన(Shiv Sena) మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra crisis)ను అపహాస్యం చేసిందన్నారు. రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే చర్చే తమ మధ్య జరగలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన బేరసారాలు సాగిస్తూనే ఉందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు


ఈ సందర్భంగా శివసేనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన దేవేంద్ర ఫడ్నవిస్.. ఉద్దవ్ థాకరేకు అధికార దాహం ఏ స్థాయికి చేరిందంటే.. ఆఖరికి సోనియా గాంధీతో చేతులు కలపడానికి కూడా వాళ్లు వెనుకాడలేదు అని మండిపడ్డారు. మేము హార్స్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నామని మాపై ఆరోపణలు చేస్తున్నారు కానీ మాపై ఆరోపణలు చేసేవాళ్లు హార్స్ ట్రేడింగ్‌ చేస్తున్నారని అన్నారు. మూడు చక్రాలపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. బీజేపి ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతుందని ఫడ్నవిస్ స్పష్టంచేశారు.