డీఎన్ఏ (డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్) సరికొత్త పంథాకి నాంది పలికింది. ఈ  పత్రికకు సంబంధించిన ముంబయి ఎడిషనులో తొలిసారిగా ఆగ్మెంటెడ్ రియాలిటీ పద్ధతిని ఉపయోగించి పాఠకులను, ప్రకటనదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పత్రికల్లో వచ్చే చిత్రాలను, ప్రకటనలను డీఎన్‌ఏ ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్ ద్వారా స్కాన్ చేసి.. వార్తలను చదవడంలో.. చిత్రాలను చూడడంలో కొత్త అనుభూతిని పాఠకులు పొందడమే ఈ సరికొత్త టెక్నాలజీలో ఉండే ప్రథమ సౌలభ్యం. ముఖ్యంగా పలు ప్రకటనదారులతో టెక్నాలజీ పార్టనర్‌షిప్ కొనసాగిస్తున్న డీఎన్‌ఏ మరెందరో పాఠకులకు నాణ్యమైన సేవలను అందించడం కోసం ఈ కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. 


ఈ కొత్త టెక్నాలజీ గురించి గత సంవత్సరం తొలిసారిగా అమెరికాలో వార్తలు వచ్చాయి. ఆ దేశంలో నిర్వహించిన మీడియా పోల్‌లో దాదాపు 80 శాతం మంది పాఠకులు ఈ టెక్నాలజీని ఉత్తమమైందిగా కొనియాడారు. తాము ప్రకటనలను చూడడంలో కొత్త అనుభూతిని పొందుతున్నామని తెలిపారు. ఇప్పటికే మరెందరో పాఠకులను, వీక్షకులను ఈ టెక్నాలజీతో అనుసంధానించడం కోసం ఓత్ అనే వెరిజోన్ ప్రాంత మీడియా కంపెనీతో పాటు ఏఓఎల్, యాహూ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చాయి. 


ఈ కొత్త విధానాన్ని తొలిసారిగా తమ పత్రికతో మొదలుపెడుతున్న డీఎన్‌ఏ సీఈఓ సంజీవ్ గర్గ్ మాట్లాడుతూ "మా సంస్థ ఎప్పుడూ సృజనాత్మకమైన ఆలోచనలను ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఈ ఆలోచనలతోటే మేము ఎప్పుడూ మా పాఠకులకు, ప్రకటనదారులకు నాణ్యమైన సేవలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ సరికొత్త ఆలోచనలో ప్రింట్ మీడియాని డిజిటల్ మీడియాతో అనుసంధానం చేయగలిగే ఓ దీర్ఘకాలిక ప్రణాళికకు శ్రీకారం చుట్టాలనే యోచనతో ఉన్నాము. కొత్త వినియోగదారులను, మా కొత్త భాగస్వాములను ఆకట్టుకోవడమే మా లక్ష్యం. అందులో భాగంగా మేము ఇప్పుడు తొలి అడుగు వేస్తున్నాం" అని తెలిపారు