బీజేపీకి ఓటెయ్యకపోతే, కాంగ్రెస్ ఓటర్లకు ప్రధానమంత్రి ఉజ్వల పథకం ప్రయోజనాలు కల్పించబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే యశోధరా రాజే సింధియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధియా, ఇది బీజేపీ పథకమని, మమ్మల్ని కాదని ప్రతిపక్ష పార్టీలకు ఓటేస్తే ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్‌లు ఇవ్వబోమని తెలిపింది. రాజే, కొలరాస్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన ఇక్కడ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మీకు గ్యాస్ పథకం ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకుంటే అది బీజేపీ పథకం కాబట్టి. మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మీకు ఈ పథకం వర్తించదు. మీరు బీజేపీకి ఓటు వేస్తే ఈ పథకం వర్తిస్తుంది" అని యశోధర అన్నారు. మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మేము మీకు ఇవి ఎందుకు ఇవ్వాలి? మీరు బాగా అలోచించి బీజేపీ పార్టీకి ఓటువేస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీ ఇంటి వద్దకే వస్తాయని ఆమె తెలిపారు.


ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకం. దీనిని ఉత్తరప్రదేశ్ బాలియాలో మే 1వ తేదీ 2016న ప్రారంభించారు. దేశంలోని దారిద్యరేఖ దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లను అందించాలనేది ఈ ప్రధానమంత్రి ఉజ్వల పథకం యొక్క ప్రధాన లక్ష్యం.