‘ఫ్లైట్లో దోమలు; కొట్టి దించేశారు డాక్టర్ని’
లక్నో నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న డాక్టర్ సౌరభ్ రాయ్, విమానంలో దోమలు ఉన్నాయని చెబితే తనపై ఇండిగో క్రూ సిబ్బంది చేయి చేసుకున్నారని ఆరోపించారు.
లక్నో నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న డాక్టర్ సౌరభ్ రాయ్, విమానంలో దోమలు ఉన్నాయని చెబితే తనపై ఇండిగో సిబ్బంది చేయి చేసుకున్నారని ఆరోపించారు. అయితే డాక్టరు మాటల్లో నిజం లేదని.. ఆయన విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని ఇండిగో ఆరోపించింది. అయితే, ప్రత్యామ్నాయం చూపడానికి బదులు క్రూ బృందం తనతో వాగ్వాదానికి దిగి, చేయి కూడా చేసుకుందని డా. సౌరభ్రాయ్ ఆరోపించారు.
తనను విమాన సిబ్బంది బెదిరించి, విమానంలో నుంచి దించేసి అవమానించారని డాక్టర్ సౌరభ్ రాయ్ ఆరోపించారు. ఇండిగో సిబ్బంది విమానంలో నుండి తన సామగ్రిని విసిరేశారని ఆయన తెలిపారు. దోమలు లక్నోలోనే కాదు.. దేశమంతటా ఉన్నాయని ఎయిర్ హోస్టెస్ ఘాటుగా బదులిచ్చింది అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే ఈ ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. "ఈ ఉదయం లక్నో నుండి బెంగళూరుకు వెళ్లే విమానంలో సౌరభ్ రాయ్ అనే ప్రయాణీకుడు సిబ్భందితో అసభ్యంగా ప్రవర్తించారు . అతను దోమలు ఉన్నాయని ఆరోపించాడు. సిబ్బంది అతనికి బదులిస్తుంటే.. అతను దూకుడుగా మాట్లాడుతున్నాడు. అతడు ఉపయోగించిన భాష కూడా సరిగా లేదు"అని ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.